సల్మాన్‌ఖాన్.. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. కండల వీరుడుగా పేరు తెచ్చుకున్న సల్మాన్.. ఇప్పుడు భయం గుప్పిట్లో ఉన్నాడు. ఒకరి పేరు చెబితే వణికిపోతున్నాడు. పోలీసుల పహారా మధ్య కాలం గడుపుతున్నాడు. బాంద్రాలోని సల్మాన్ నివాసం ఇప్పుడు పోలీసుల గుప్పిట్లో ఉంది. అతను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోకి సంబంధించిన వెన్యూ దగ్గర కూడా భద్రత కటుదిట్టం చేశారు. దాదాపు 60 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. గత కొంతకాలంగా సల్మాన్‌ఖాన్ కుటుంబాన్ని భయం పట్టి పీడిస్తోంది. ఓ పక్క స్టార్డమ్, ఓ పక్క అభిమానులు, మరో పక్క సల్మాన్‌ఖాన్‌కి ఛాలెంజ్ విసురుతున్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్. ఒక్కమాటలో చెప్పాలంటే సల్మాన్ జీవితంలో మనశ్శాంతి కరువైంది. అతనికి ఈ దుస్థితి రావడానికి కారణమేంటి? అనేది తెలుసుకోవాలంటే 26 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి.
బాలీవుడ్లో స్టార్ రైటర్స్‌గా పేరు తెచ్చుకున్న సలీమ్ జావేద్‌లలో సలీమ్‌ఖాన్ కుమారుడే సల్మాన్‌ఖాన్. 1988లో ‘ఫలక్’ అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే సంవత్సరం వచ్చిన ‘బీవీ హోతో ఐసీ’ చిత్రంలో ఒక క్యారెక్టర్ పోషించడం ద్వారా నటుడిగా మారాడు. ఆ మరుసటి సంవత్సరమే రాజశ్రీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సల్మాన్ అదే సంస్థలో చేసిన ‘హమ్ ఆప్కె హై కౌన్’ చిత్రంతో స్టార్ హీరో అయిపోయాడు. ఇక 1999లో ఆ సంస్థలోనే ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చేశాడు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే అతని జీవితం తారుమారైంది. 1998లో ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ రాజస్థాన్ వెళ్లింది. అక్కడ షూటింగ్ గ్యాప్‌లో గన్ తీసుకొని అడవిలోకి వెళ్లి కృష్ణజింకను కాల్చి చంపి తీసుకొచ్చాడనే వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
1998 అక్టోబర్ 2న సల్మాన్‌ఖాన్‌పై కేసు నమోదైంది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. అక్కడ దాదాపు 20 రోజులు ఉన్నాడు. సల్మాన్ ఖాన్ కృష్ణజింకను వేటాడినట్టు ఆధారాలు లేని కారణంగా రాజస్థాన్ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అక్కడితో ఆగని రాజస్థాన్ ప్రభుత్వం కేసును సుప్రీమ్ కోర్టుకు తీసుకెళ్లింది. 26 ఏళ్ళుగా సుప్రీమ్ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఇన్నేళుగా తాము చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం లేకపోవడంతో బిష్ణోయ్ గ్యాంగ్‌లో అసహనం మొదలైంది. సల్మాన్‌కు మనమే మరణశిక్ష విధించాలి అనేంత కసి వారిలో పెరిగిపోయింది. అసలు ఎవరీ బిష్ణోయ్.. ఎక్కడి నుంచి వచ్చాడు, గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు, ప్రస్తుతం జైలులో ఎందుకున్నాడు?
బిష్ణోయ్ గురించి తెలుసుకోవాలంటే 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 15వ శతాబ్దంలో రాజస్థాన్‌కు చెందిన జంబేశ్వర్ అనే వైష్ణవ భక్తుడు బిష్ణోయ్ పంత్ అనే కొత్త థియరీతో ఒక సమాజానికి ఊపిరి పోశాడు. జంతువులను ప్రేమించాలి, మాంసాహారం తినకూడదు, నిజాయితీగా జీవించాలి అంటూ ఆయన చేసిన బోధనలను దాదాపు 6 లక్షల మంది బిష్ణోయ్‌లు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయన చెప్పిన మార్గంలోనే జీవిస్తున్నారు. బిష్ణోయ్‌ల సంప్రదాయం ప్రకారం జంతువధ చాలా పెద్ద నేరం. కృష్ణజింకను ఈ తెగవారు దేవతగా పూజిస్తారు. వాటికి ఎవరైనా హాని తలపెడితే వారిని చంపడానికి కూడా వెనుకాడరు. అలాంటి పవిత్రమైన కృష్ణజింకను చంపి తిన్న సల్మాన్‌ఖాన్ తమకు శత్రువు అంటూ బిష్ణోయ్ తెగ బహిరంగంగా ప్రకటించింది. ఆ తెగకు చెందినవాడే లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్‌ఖాన్‌పై ఈ కేసు పెట్టే సమయానికి బిష్ణోయ్ వయసు కేవలం 5 సంవత్సరాలే. వయసు పెరుగుతున్న కొద్దీ సల్మాన్‌పై తమ తెగ పెంచుకున్న ద్వేషం గురించి తెలియవచ్చింది. ఆ పగ, ప్రతీకారాలతోనే పెరిగిన బిష్ణోయ్.. ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి 700 మంది సభ్యులతో తన ప్రపంచాన్ని ఐదారు రాష్ట్రాల్లో విస్తరించాడు. సల్మాన్‌ఖాన్‌ని చంపడమే తన ధ్యేయమని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడైన మంత్రి బాబా సిద్ధిఖీని చంపడం ద్వారా తను ఏమిటో నిరూపించుకోవాలనుకున్నాడు బిష్ణోయ్. అయితే ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్న బిష్ణోయ్.. అక్కడి నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు.
గత ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. సల్మాన్‌కి ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ ఇది అని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పానిపట్‌కి చెందిన సుఖ్బీర్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన 18 మందిని విచారిస్తే ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు బయటికి వచ్చాయి. సల్మాన్‌ను హతమార్చేందుకు ఒక టీమ్‌ని ఏర్పాటు చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. వారిని షాట్ షూటర్స్‌గా మార్చే పనిలో ఉంది. మరోపక్క రూ.25 లక్షలు సుపారీ తీసుకొని మరో గ్యాంగ్ సల్మాన్‌ను హతమార్చేందుకు పొంచి ఉంది. ఇలా అతని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.
బాబా సిద్ధిఖీ హత్య కేసులో బిష్ణోయ్‌తోపాటు అతని సోదరుడు అన్మోల్, సంపత్ మెహ్రా, గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా.. ఇలా బిష్ణోయ్ గ్యాంగ్‌లోని కీలక వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే.. అతను బిష్ణోయ్ దేవాలయానికి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. అలా చేస్తే అతని జోలికి రాబోము అని చెప్పింది. వాళ్ళు చెప్పినట్టు సల్మాన్ చేస్తే నేరం ఒప్పుకున్నట్టు అవుతుంది. దాంతో కోర్టు కూడా చర్యలకు దిగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా గురువారం ముంబాయి ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నెంబర్‌కి ఒక మెసేజ్ వచ్చింది. సల్మాన్ ప్రాణం కావాలంటే రూ.5 కోట్లు చెల్లించాలని ఓ మెసేజ్ వచ్చింది. అయితే ఇది బిష్ణోయ్ గ్యాంగ్ పంపిన మెసేజ్ కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు సల్మాన్ ముందు రెండు ప్రశ్నలు ఉన్నాయి. బిష్ణోయ్ దేవాలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పాలా? లేక రూ.5 కోట్లు చెల్లించాలా? ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు.
58 ఏళ్ళ సల్మాన్‌ఖాన్ పెళ్లి చేసుకోకుండా అవివాహితుడుగానే ఉండిపోయాడు. ఒక సినిమాకి రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకునే సల్మాన్.. 2007లో బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌ను స్థాపించి ఎంతో మంది పేదవారికి, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సాయం అందించాడు. కొన్ని వేలమందికి విద్యాదానం చేస్తున్నాడు. అంతేకాదు, వేల మందికి ఉపాధి కల్పించాడు. రెండేళ్ళ పాపకు బోన్ మేరో అవసరమైతే తన బోన్ మేరో ఇస్తానని ప్రకటించాడు. తను చేస్తున్న ఈ చారిటీ వెనుక ఎలాంటి కారణం లేదని, తను ఎందుకు అందరికీ సాయం చెయ్యాలనుకుంటున్నాడో తనకే తెలీదని చెప్పారు. దేశవ్యాప్తంగా అతని సహాయం పొందినవారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాదు, అతనికి అభిమానగణం కూడా ఎక్కువే. ఇప్పుడు సల్మాన్ వున్న పరిస్థితిపై వారంతా ఆందోళన చెందుతున్నారు. అతను ఎదుర్కొంటున్న ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం రావాలని అందరూ కోరుకుంటున్నారు.